సుక్కు పేరుతో సినిమాను సేల్ చేసేస్తున్నారే


సిద్దార్థ్ రాయ్.. తెలుగులో రాబోతున్న ఓ కొత్త సినిమా. ఇందులో హీరోగా నటించిన దీపక్ సరోజ్ కొత్త వాడు. హీరోయిన్ కూడా కొత్తమ్మాయే. దర్శకుడు యశస్వి కొత్త. నిర్మాతా కొత్తవాడే. ఇందరు కొత్త వాళ్లు కలిసి చేస్తున్న సినిమా అయినప్పటికీ.. ఇది జనాల దృష్టిలో పడింది. అందుకు సినిమా ప్రోమోల్లో ఉన్న కంటెంట్ మాాత్రమే కాదు.. అగ్ర దర్శకుడు సుకుమార్ కూడా ఒక ముఖ్య కారణమే. దీని టీజర్, ట్రైలర్ చూస్తే ‘అర్జున్ రెడ్డి’కి డబులెక్స్ వెర్షన్ లాగా అనిపించింది.

అర్జున్ రెడ్డి పాత్ర స్ఫూర్తితోనే ఈ సినిమా చేసినట్లున్నాడు దర్శకుడు యశస్వి. అర్జున్ రెడ్డి పాత్రను ఇంకా మ్యాడ్‌గా చూపిస్తే అతను సిద్దార్థ రాయ్ అన్నట్లు కనిపించాయి ప్రోమోలు. అర్జున్ రెడ్డికి అనుకరణలా అనిపించినప్పటికీ.. ఇందులో ఇంటెన్సిటీ లేకపోలేదు.

సినిమాలో కంటెంట్ సంగతి అలా ఉంచితే.. జనాలు ‘సిద్దార్థ్ రాయ్’ మీద కన్నేసింది సుకుమార్ వల్లే. ఈ సినిమా టీజర్‌ను జనాలు పెద్దగా పట్టించుకోని సమయంలో సుకుమార్‌కు దర్శకుడు దాన్ని పంపడం.. ఆయన ఇంప్రెస్ అయి దర్శకుడికి మెసేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సినిమాను పూర్తి చేసి సుకుమార్‌కు చూపించాడు యశస్వి. ఆ సినిమాచూసి యశస్విని మెచ్చేసుకోవడమే కాక.. తన బేనర్లో సినిమా చేయమని ఆఫర్ కూడా ఇచ్చాడు.

సుకుమార్ నిర్మాణంలో సినిమా చేయబోయే ‘సిద్దార్థ్ రాయ్’ దర్శకుడు అంటూ జనాలు మాట్లాడుకున్నాక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ట్రైలర్ రిలీజై యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లాంచ్ సమయంలో కూడా దర్శకుడు, మిగతా టీం సుకుమార్‌కు ఈ సినిమా నచ్చడం, దర్శకుడికి అవకాశం ఇవ్వడం గురించే మాట్లాడింది. సుకుమార్ మెచ్చిన సినిమా, దర్శకుడు అంటూ.. ‘సిద్దార్థ్ రాయ్’ని టీం బాగానే ప్రమోట్ చేసుకుంటోంది. ఆయన పేరే సినిమాకు ప్రచారాస్త్రంగా మారింది. చూస్తుంటే ‘సిద్దార్థ్ రాయ్’కి ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చేలా ఉన్నాయి.


Leave a Comment